నిద్రమత్తులో స్టేషన్‌ మాస్టర్‌.. గ్రీన్​ సిగ్నల్​ లేక రైలు అరగంట వెయిటింగ్

-

విధుల్లో ఉన్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకుని.. సిగ్నల్‌ లేక ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు అరగంటపాటు నిలిచిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటావా సమీపంలోని ఉడిమోర్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు మే 3వ తేదీన ఉడిమోర్‌ జంక్షన్‌కు చేరుకుంది.  అప్పటికే అక్కడున్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకోవడంతో.. మరోవైపు గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడం వల్ల రైలును లోకోపైలట్‌ అక్కడే నిలిపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు లోకోపైలట్ అనేక సార్లు హారన్ కొట్టినట్లు తెలిసింది.

అప్పటికే రైలు అక్కడ దాదాపు అరగంటపాటు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు స్టేషన్ మాస్టర్‌ పైక్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. తనతోపాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడం వల్ల, తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news