రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీపై ఆంక్షలు విధించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్తగా చేపట్టిన డిజిటల్ 2.0 ప్రక్రియను నిలిపి వేయాలని, అలాగే కొత్తగా క్రెడిట్ కార్డులను మంజూరు చేయకూడదని ఆర్‌బీఐ ఆ బ్యాంకును ఆదేశించింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు ఇటీవల ఒక రోజు సుమారుగా 12 గంటల పాటు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.
కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇదే విషయాన్ని తన కస్టమర్లకు సైతం తెలియజేసింది. ఆర్‌బీఐ డిసెంబర్ 2న ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త కార్డుల జారీ ప్రక్రియ, ఇతర నూతన డిజిటల్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు నిలిచిపోవడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఇలాగే జరిగింది. గడిచిన 2 ఏళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారి. నవంబర్ 21న తాజాగా బ్యాంక్‌కు చెందిన సేవలు 12 గంటల పాటు నిలిచిపోయాయి.
అయితే బ్యాంక్‌కు చెందిన డేటా సెంటర్‌లో పవర్ ఫెయిల్యూర్ అవడం వల్లే తమ సేవలు నిలిచిపోయానని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అయితే తరచూ ఇలా జరుగుతుండడంతో ఆర్‌బీఐ సీరియస్ అయింది. వెంటనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అప్పటి వరకు కొత్త కార్యకలాపాలను చేపట్టకూడదని ఆదేశించింది. ఇక ఆర్‌బీఐ ఆదేశాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 1 శాతం పడిపోయాయి. షేర్ విలువలో స్వల్ప తగ్గుదల కనిపించింది. రూ.1432 ఉన్న షేర్ ధర రూ.1388.85కు పడిపోయింది.