దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగినా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ షురూ కాగానే గందరగోళం మళ్లీ మొదలైంది. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే క్రమంలో ఎంసీడీ సదన్ రసాభాసాగా మారింది. ఈ ఎన్నిక జరిగేటప్పుడు సెల్ఫోన్లను తీసుకెళ్లడానికి అనుమతిస్తామన్న మేయర్ షెల్లీ ఒబెరాయ్ నిర్ణయాన్ని బీజేపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. వెల్‌లోకి వచ్చి మేయర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆప్ సభ్యులు.. మేయర్ నిర్ణయానికి మద్దతుగా నినాదాలు చేయటం వల్ల సదన్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. సభ్యులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. వాటర్ బాటిళ్లు, పేపర్లు, చేతికి దొరికిన ప్రతి వస్తువును విసురుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఓటింగ్ ప్రక్రియను మేయర్ రేపటికి వాయిదా వేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. ఇప్పటికే రాత్రి నుంచి పలుసార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే.