ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సమీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్ ఖాన్ తనను వేడుకున్నారని పేర్కొన్నారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా షారుక్ ఖాన్ చేసినట్లుగా చెబుతున్న ఓ వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సమీర్ వాంఖడే హైకోర్టుకు సమర్పించారు. ‘‘ఈ కేసులో కాస్త నిదానంగా వ్యవహరించండి. విచారణకు అన్ని వేళలా సహకరిస్తానని మాటిస్తున్నా. నేనేంటో మీకూ తెలుసు కదా. దయచేసి మా కుటుంబంపై కనికరం చూపండి. ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా నా కుమారుడిని జైల్లో పెట్టకండి ప్లీజ్. అది అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఏం చెప్పినా చేస్తా. ఓ తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నా’’ అని షారుక్ తనకు వాట్సప్‌లో మెసేజ్‌లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.