సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు డాక్టరైతే తర్వాత జనరేషన్లో కూడా డాక్టర్లు ఉండే అవకాశం ఉంది. అలా తరతరాలుగా ఒకే వృత్తిలో ఉండటం సహజం. కానీ బిహార్‌లో మాత్రం ఒకే కుటుంబంలో ఒకే జనరేషన్కు చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు అధికారులుగా పని చేస్తున్నారు. పోలీసు, అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో ఈ సెవెన్ సిస్టర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఛప్రా జిల్లాకు చెందిన కమల్‌సింగ్‌కు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ అమ్మాయిలేనని బంధువులు మాటలతో మానసిక వేదనకు గురి చేయడంతో ఆయన తన స్వగ్రామం వీడి, ఛప్రా జిల్లా ఎక్మాలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేసుకొంటూ ఇంటి వద్ద పిండి గిర్నీ నడుపుతూ ఏడుగురు ఆడపిల్లలను చదివించాడు. ఏడుగురు అమ్మాయిలే పుట్టారని ఏ మాత్రం నిరాశ చెందకుండా వారిని ఉన్నత విద్యావంతులను చేశాడు. ఇప్పుడు ఈ సెవెన్ సిస్టర్స్.. బిహార్ పోలీసుశాఖలో, వివిధ కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ ఈ ఏడుగురు తల్లిదండ్రులకు, తమ్ముడు రాజీవ్‌సింగ్‌కు ఛప్రాలోని ఎక్మా బజార్‌లో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి కానుకగా ఇచ్చారు.