దిల్లీ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవకముందే.. మరో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లిఫ్ట్‌లో 45 నిమిషాల పాటు విద్యార్థులు ఇరుక్కున్న ఘటన చోటుచేసుకుంది. యూపీలోని లఖ్‌నవూలోని గోమతి నగర్‌లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా అది ఒక్కసారిగా ఆగిపోయిన ఘటన శనివారం రోజున జరిగింది. ఎంతకూ లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి కాల్ చేశారు. కానీ వారు స్పందించలేదు. ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటూ లిఫ్టులో భయపడుతూ గడిపారు. ఇంతలో ఆందులో ఓ విద్యార్థినికి ఐడియా తట్టి వెంటనే తన భర్తకు కాల్ చేసి విషయం చెప్పారు. అతడు వెంటనే కోచింగ్ సెంటర్కు చేరుకుని యాజమాన్యానికి విషయం చెప్పాడు. అయినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లిఫ్ట్ ఆపరేటర్ సాయంతో లోపాన్ని సరిచేసి విద్యార్థులను కాపాడారు. అయితే లిఫ్ట్‌కు సంబంధించిన మాస్టర్ కీ సెక్యూరిటీ గార్డు వద్ద లేకపోవడంతో జాప్యం జరిగినట్లుగా యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.