ప్రజాస్వామ్య దేశంలో ఒక అంశంపై చర్చించి చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పునరుద్ఘాటించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ పార్టీలు అమలుచేసే ఉచిత పథకాలను నియంత్రించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ భాజపా నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ మంగళవారం సుమారు గంటపాటు వివిధ పక్షాల వాదనలు విన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, వికాస్‌సింగ్, అభిషేక్ సింఘ్వి, గోపాల్ శంకర్ నారాయణన్‌ల వాదనలను పరిగణనలోకి తీసుకున్నారు.
”ఉచితాలను వేరుచేసి చూడటం చాలా కష్టం. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు సైకిళ్లు ఇస్తున్నాయి. దానివల్ల ఆడపిల్లలు స్కూళ్లకు వెళ్లడం పెరిగిందని, వాటిని ఉపయోగించుకుని దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అందువల్ల ఏది ఉచితం? ఏది ప్రజల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న పథకం అని చెప్పడం కష్టం. కల్లుగీత కార్మికులు, క్షురకులు, రజకులకు వారికి పనికొచ్చే పరికరాలు ఇస్తుంటారు. ఆ మాత్రం వస్తువులను వారు కొనుక్కోలేరా అని పట్టణాల్లో మనం అనుకుంటుంటాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గేవారి జీవనోపాధులు ఆ చిన్న పరికరాలపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటివి ఇవ్వడంవల్ల వారి జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అందువల్ల మనం ఇక్కడ కూర్చొని వాటి గురించి చర్చించలేం. ఇన్ని కోట్లమంది ప్రజల భవిష్యత్తును ఒక కమిటీ నిర్దేశిస్తుందని నేను చెప్పడంలేదు. నేను పార్లమెంటుకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తున్నాను. ఆర్థిక పరిస్థితులను తెలుసుకోకుండా చేసే వాగ్దానాలను అనుమతించకూడదని పిటిషనర్లు అంటున్నారు.. ఆ విషయం రేపు (బుధవారం) చూద్దాం” అంటూ సీజేఐ జస్టిస్ రమణ విచారణను వాయిదా వేశారు.