ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వానికి, స్వాతి మాలీవాల్‌కు మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. తన రాజ్యసభ సీటే కావాలంటే వారు నేరుగా అడిగి ఉండాల్సిందని.. అప్పుడు తాను రాజీనామా చేసేదాన్నని స్వాతి వ్యాఖ్యానించారు.
ఎంపీ సీటు అనేది చాలా చిన్న విషయమన్న మాలీవాల్.. తన జీవితంలో ఎన్నడూ ఏ పదవిపై ఆశ పడలేదని తెలిపారు. పదవులు లేకుండా కూడా తాను పని చేయగలనని పేర్కొన్నారు. కానీ ఆప్ నాయకులు కక్షగట్టి తనపై దాడి చేశారనీ.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీటుకు రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. స్వాతి మాలీవాల్‌పై తన సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేసిన అంశంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందిస్తూ.. ఈ కేసులో రెండు కోణాలు ఉండటం వల్ల విచారణ పారదర్శకంగా జరగాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.