దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు మొబైల్ టారిఫ్‌లను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఆరంభంలో మొబైల్ చార్జిలను పెంచలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం వడ్డింపులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు వచ్చే ఏడాది మార్చి వరకు మొబైల్ టారిఫ్‌లను పెంచుతాయని తెలిసింది. ప్రస్తుతం మొబైల్ టారిఫ్‌లకు గాను ఫిక్స్డ్ ఫ్లోర్ ప్రైస్ లేదు. టెలికాం కంపెనీలు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ని ఫ్లోర్ ప్రైస్‌ను కనీస పరిమితికి పెంచాలని కోరుతున్నాయి. అదే జరిగితే మొబైల్ టారిఫ్‌లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక టెలికాం కంపెనీలు ప్రతి వినియోగదారుడి నుంచి రూ.300 వరకు నెలవారీ ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ఆశిస్తున్నాయి. కానీ అది కూడా లభించడం లేదు. అయితే ఏఆర్పీయూను 20 శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అందువల్ల ఎటు చూసినా 2021లో మొబైల్ వినియోగదారులకు చార్జిల మోత తప్పదని అనిపిస్తోంది. అయితే డిసెంబర్ 2019లో 25 నుంచి 40 శాతం వరకు చార్జిలను పెంచారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చార్జిలను పెంచాల్సి ఉన్నప్పటికీ కరోనా వల్ల ఆ నిర్ణయాన్ని టెలికాం కంపెనీలు వాయిదా వేశాయి. కానీ వచ్చే ఏడాదిలో చార్జిలను కచ్చితంగా పెంచనున్నాయని తెలిసింది.