దేశవ్యాప్తంగా వైద్యవిద్యా ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షపై తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్ష దేశానికి అవసరం లేదని ఆయన అన్నారు. చెన్నైలో పది, 12 తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమిళనాడు విద్యార్థులను పార్టీ తరపున ఆయన సన్మానించిన సందర్భంగా నీట్ పరీక్షపై తన అభిప్రాయాలను విజయ్ వెల్లడించారు.
నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని విజయ్ తెలిపారు. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వడమే సమస్యకు పరిష్కారమని అన్నారు. నీట్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తప్పించి రాష్ట్ర జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని విజయ్ కోరారు.
మరోవైపు నీట్-పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం.