ఢిల్లీ పార్లమెంట్ అనెక్స్ భవనంలో తాజాగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్ష భేటీ కొనసాగింది. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వం విపక్షాలతో చర్చించింది. బడ్జెట్ తో పాటు సభ ముందుకు రానున్న బిల్లుల జాబితాను కూడా వారికి వివరించింది. టీడీపీ తరుపున లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జనసేన నుంచి బాలశౌరీ, కాంగ్రెస్ నుంచి జయరామ్ రమేష్, కె.సురేష్, మజ్లిస్ తరుపున అసదుద్దీన్ తో పాటు జేడీయూ, ఆప్, సమాజ్ వాదీ, ఎన్సీపీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ అఖిల పక్ష భేటీ హాట్ హాట్ గా కొనసాగింది. డిప్యూటీ స్పీకర్ పదవీ ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. అదేవిధంగా నీట్ వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల, ఈడీ, సీబీఐల దుర్వినియోగం సహా పలు అంశాలపై చర్చించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.