అది ఆదివారం సాయంత్ర సమయం. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అక్కడ ఉన్న ఓ ఏటీఎంలో చొరబడ్డారు. అందులో ఓ వ్యక్తి అక్కడే ఉన్న డస్ట్‌బిన్‌ను తిరగేసి దానిపై ఎక్కి.. ఏటీఎం సెంటర్లో ఉన్న ఏసీ వైర్లను కత్తిరించాడు. ఆ తర్వాత ఏసీని బయటకు తీసి.. పట్టుకుని అదే బైక్‌పై అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. అక్కడ సీసీ టీవీ ఉన్నది గమనించలేదు. ఈ దృశ్యాలన్నీ అందులో రికార్డవ్వడంతో ఈ చోరీ విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మోగా జిల్లాలో చోటుచేసుకుంది.
అయితే ఏటీఎంలోకి వచ్చి డబ్బు తీసుకోకుండా.. ఏదో సూపర్ మార్కెట్‌కు వెళ్లి చిప్స్ ప్యాకెట్ పట్టుకుని పోయినట్లు ఏసీని తీసుకెళ్లిన విధానం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. గతంలో కూడా బ్యాంకుకు చెందిన మోటారు సైకిల్ కూడా చోరీకి గురైన సమయంలోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.