వెంకయ్య నాయుడు ట్విటర్ బ్లూ టిక్ ఎందుకు తొలగించారంటే..?

సోషల్‌ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో వెరిఫైడ్‌ ఖాతాలకు బ్లూ టిక్ ఇస్తారన్న విషయం తెల్సిందే. అయితే శనివారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌ ట్విటర్‌ ఖాతాల బ్లూ టిక్‌ మాయమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది.

అయితే బ్లూ టిక్‌లు మాయం కావడంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. అయితే ఈ కారణంగానే వెంకయ్య నాయుడు బ్లూ టిక్‌ తొలగించారని ఊహాగానాలు వినిపించాయి. అయితే బ్లూ టిక్‌ తొలగింపుపై ట్విటర్ వివరణ ఇచ్చింది.

వెంకయ్య నాయుడు ట్విటర్ ఖాతా నుంచి జులై 2020 నుంచి ఎలాంటి ట్వీట్లు లేవని అందుకే బ్లూ టిక్ ఆటోమేటిక్‌గా ఆ టిక్ మాయం అయ్యిందని ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎవరి ట్విట్టర్ అకౌంట్ నుంచి అయినా ఎక్కువ రోజుల పాటు ఎలాంటి ట్వీట్లు చేయకపోతే, వారి బ్లూటిక్ ఆటోమేటిక్‌గా మాయం అవుతుందని ఆయన వివరించారు. ఇక విషయాన్ని గుర్తించిన ట్విటర్.. వెంకయ్య నాయుడు, మోహన్ భగవత్ ఖాతాలకు తిరిగి బ్లూ టిక్ మార్క్‌ను ఇచ్చింది.