ఉదయం నిద్ర లేవగానే తీసుకునే టీ లేదా కాఫీ నుంచి రాత్రి పడుకునే ముందు సేవించే పాల వరకు అందులో తియ్యదనం కోసం వాడేది పంచదార. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా చక్కెర లేకుండా కనీసం ఒకరోజుని పూరించలేరు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే…బోర్నవిటా, బూస్ట్,హార్లిక్స్ వంటి వాటిని చక్కెర లేకుండా తాగరు. అలాగే చక్కెర కలిపిన తీపి పదార్ధాలను అయితే పిల్లలు తృప్తిగా లాగించేస్తుంటారు.పండగ వచ్చిందంటే చాలు పంచదార కలిపి తయారు చేసిన వంటకం కనీసం ఒక్కటైనా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే.
అంతలా చక్కెరతో ముడిపడిపోయాయి మన జీవితాలు. అయితే వంటింట్లో నిత్యావసర వస్తువుగా మారిన పంచదారను ఇచ్చే చెరకు సాగు రాను రాను తగ్గిపోతోంది. పంచదార ప్రియులను ఆందోళనకు గురి చేసే విషయమిది. అయితే అలాంటి దిగులు అవసరం లేదు అంటున్నారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలోనే చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న యూపీ నుంచి అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని అంటున్నారాయన.
యూపీలో జరిగిన రాష్ట్రస్థాయి చెరకు ఉత్పత్తి పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం యోగి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో 3,171 సహకార మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, 59,000 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు, వారు 60 లక్షల మంది చెరకు రైతులతో కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతున్నారు” అని చెప్పారు.ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ, 2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2010 నుంచి 2017 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను రైతులకు విడతల వారీగా చెల్లించామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చడంలో చెరకు రైతుల సహకారం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పిన ఆయన సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వారికి వివరించారు.
‘‘రైతుల కోసం ప్రధాని మోదీ అమలు చేస్తున్న పలు సంస్కరణలు రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయని యోగి చెప్పారు. కేంద్రం సాయంతో త్వరలో మరికొన్ని నూతన చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర జీడీపీలో చక్కెర రైతుల సహకారం 9 శాతం కాగా త్వరలో ఇది రెట్టింపు కానుందని పేర్కొన్నారు. చక్కెరతో పాటు ఇథనాల్ ఉత్పత్తిలో యూపీ దేశంలోనే అగ్రాస్థానంలో ఉందన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు చక్కెరను పెద్దమొత్తంలో ఎగుమతి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రైతులకు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తామన్నారు.
తీవ్రమైన నష్టాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్న రోజులివి.వ్యవసాయం దండగ అంటూ పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అయితే యూపీలో అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. ప్రత్యేకించి చెరకు సాగులో అమోఘమైన దిగుబడులు సాధిస్తున్నారు ఇక్కడి రైతులు. యోగి చొరవతో రైతులు వ్యవసాయం చేయాలంటే పోటీ పడుతున్నారు.ఇలాంటి సానుకూల పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో రావాలని ఆశిద్దాం.