లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 85ఏళ్లు పైబడిన వారు, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని ఈసీ తెలిపింది. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారని, నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను తెస్తారని పేర్కొంది. అయితే ఓటు ఎలా వేయాలి? దానికి ఏం చేయాలంటే?
ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫారం 12డి నింపి రిటర్నింగ్ అధికారికిగానీ, సహాయ రిటర్నింగ్ అధికారికిగానీ పంపించాలి.
దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబరు పొందుపరచాలి.
ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
దరఖాస్తులను అందుకున్న తర్వాత సంబంధిత దరఖాస్తుదారుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అర్హతలను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.