ఓ హిందూ టైలర్ ను కొందరు నరికి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – మమతా బెనర్జీ

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయపూర్ లో టైలర్ ను దారుణంగా హత్య చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. టైలర్ కన్నయ్య లాల్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది.

నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ హిందూ టైలర్ ను కొందరు నరికి చంపడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.” హింస, ఉన్మాదం ఎప్పటికీ అనుసరణీయం కాదు. అది ఏదైనా సరే. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా వారికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాం. అంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.