కరోనా పుట్టిల్లు అయిన చైనాను ఆ మహమ్మారి మరోసారి గడగడలాడిస్తోంది. ఈసారి కొత్త వేరియంట్ రూపంలో త్వరత్వరగా వ్యాపిస్తోంది. ఈ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోంది. అయితే చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 భారత్‌లోనూ వెలుగు చూసింది. ఇప్పటివరకు మూడు కేసులు నమోదుకాగా రెండు గుజరాత్‌లోనే బయటపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒమిక్రాన్ ఉపరకమైన ఈ వేరియంట్‌కు రీఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యమూ ఉంది.
ఏమిటీ బీఎఫ్.7 వేరియంట్..?.. అధికారిక వర్గాల ప్రకారం.. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ వేరియంట్(Omicron), దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్ వంటి నగరాల్లో బీఎఫ్.7 వేరియంట్ ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్ కారణంగానే చైనా వ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్ఫెక్షన్ బారిన పడకపోవడం, వ్యాక్సిన్ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.