ఒడిశా ఆస్పత్రుల్లో హాహాకారాలు.. రక్తదానం చేసేందుకు బారులు తీరిన యువత

-

ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మందికి పైగా దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వెల్లడించాయి.

ప్రస్తుతం ఈ ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఒడిశాలోని ఆస్పత్రులు బీతావహంగా మారాయి. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ఎక్కువగా రక్తాన్ని కోల్పోయారు. దీంతో క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు భారీ సంఖ్యలో యువత ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఈ ఆపద సాయంలో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సహాయచర్యలపై పూర్తిగా దృష్టి సారించామని చెప్పారు. ఘటనాస్థలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేమన్న మంత్రి.. ప్రమాద ఘటనపై విచారణ చేసి మరిన్ని వివరాలు చెబుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news