గుజరాత్ రాష్ట్రాన్ని బిపర్‌జోయ్ తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. అయితే.. తాజాగా బిపర్‌జోయ్ తుఫానుపై NDRF డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ కీలక ప్రకటన చేశారు. బిపర్‌జోయ్ తుపాను నిన్న సాయంత్రం తీరాన్ని తాకిన తర్వాత గుజరాత్‌లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అతుల్ కర్వాల్ ప్రకటించారు. అయితే కొండచరియలు విరిగిపడకముందే ఇద్దరు చనిపోయారని, కొండచరియలు విరిగిపడిన తర్వాత ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు అతుల్ కర్వాల్. న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఇరవై నాలుగు జంతువులు చనిపోయాయని, 23 మంది గాయపడ్డారన్నారు. దాదాపు వెయ్యి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, 800 చెట్లు నేలకూలాయన్నారు అతుల్ కర్వాల్. రాజ్‌కోట్‌లో తప్ప ఎక్కడా భారీ వర్షాలు కురువలేదన్నారు.
కచ్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు నలభై శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. తీరం దాటే సమయానికి తుపాను సామర్థ్యం కాస్త తగ్గిందని, దీంతో నష్టం కొంతమేర తగ్గినట్లు చెప్పారు. వర్షం ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం, బలహీనమైన బిపర్‌జోయ్ తుపాను దక్షిణ రాజస్థాన్ వైపు పయనిస్తోందని, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భుజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరణ్ సింగ్ వాఘేలా అన్నారు. ముంద్రా, మాండ్వి, నాలియా, జఖౌ వద్ద భారీ వర్షాలతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి జిల్లా అంతటా బందోబస్తు ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. తుపాను పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.