ఎన్నెన్నో అనుకున్నారు.. ఏవేవో ఆశించారు.. అనుకున్నదే తడవుగా గోడ దూకేశారు. కట్ చేస్తే ఏదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైసీపీలోకి జంప్ అయ్యారు. అలా నెల్లూరు జిల్లాలోనూ చాలామంది చివరి క్షణంలో ఏవేవో లెక్కలు వేసుకుని గోడ దూకేశారు. ప్రాధాన్యం ఇస్తామని పెద్దలు హామీ ఇవ్వడంతో ఏదో ఒక పదవి రాకపోతుందా అనీ ఏవేవో ఊహించుకున్నారు. కానీ.. పవర్‌లోకి వచ్చి ఏడాదిన్నరైనా ఇలాంటి నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదట. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారట ఈ గోడ దూకిన నేతలు.
మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి ఎన్నికల ముందు బీజేపీని వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో టీడీపీ అధిష్ఠానం నెల్లూరు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా వద్దనుకుని వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ వైసీపీలో చేరారు. కానీ.. వెంకటగిరి టికెట్‌ను మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎగరేసుకుపోయారు. వెంకటగిరిలో మరొకరి ప్రమేయాన్ని ఆనం అంగీకరించకపోవడంతో రాంకుమార్‌రెడ్డి రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ.. ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను శాసించిన వెంకటగిరి రాజాలు సైతం ఎన్నికల సమయంలో వైసీపీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యే ఆనం కారణంగా వీరికి పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో గూడూరు వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్సీ నేత మేరిగ మురళీధర్‌కు లక్ ఇంకా కలిసి రాలేదట.
గూడూరు డివిజన్‌లో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు దొంతు శారద, పోనకా దేవసేనలు కూడా ఏదో ఆశించి వైసీపీ శిబిరంలోకి వచ్చారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేసినా.. పార్టీ ఫండ్ ఇచ్చినా పట్టించునే వారే లేరట. ఓ మంత్రి సహకారంతో దేవసేనకు నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. అదే పదవి కోసం నెల్లూరు ఎంపీ అనుచరుడు సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారట.
కావలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీలో చేరినా ఆయన్నీ లెక్కల్లోకి తీసుకోవడం లేదట. పైగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఒంటేరుకు అస్సలు పడటం లేదు. దీంతో ఒంటేరు తిరిగి టీడీపీ గూటికి వచ్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలోని జంప్ జిలానీల భవిష్యత్ ఆశించినట్టుగా ఏమీ లేదన్న కామెంట్స్ జోరందుకున్నాయి.