నెల్లూరు వైసీపీలో హీట్ పెంచుతున్న ఆనం VS అనిల్

-

ఒకప్పుడు ఆ జిల్లాలో వాళ్లు చెప్పిందే శాసనం. వాళ్లు చేసిందే చట్టం. కాలం మారింది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అయ్యాయి అంటే ఇదేనేమో.. కొత్త పెత్తందార్లు వచ్చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరిగితే.. ఆ చర్చలో తప్పకుండా ఆనం కుటుంబం ప్రస్తావన ఉంటుంది. ఒకప్పుడు కనుసైగలతో జిల్లాను.. జిల్లా రాజకీయాలను శాసించారు. అలాంటిది మారిన రాజకీయ పరిణామాలు.. జంపింగ్‌లు.. వారి ఉనికినే ప్రమాదంలో పడేశాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాను శాసిస్తున్నవారు.. ఆదేశిస్తున్న నాయకులు వేరు. వాళ్లూ వీళ్లూ కలిసి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నా.. కొత్త తరం మాటే నెగ్గుతోంది దీంతో జిల్లాలో ఆధిపత్య రాజకీయాలకు తెర లేచింది.

రాజకీయంగా.. అధికార వర్గాల్లో పలుకుబడి పరంగా ఇప్పుడు జిల్లాలో ఆనంవారి మాట వినే పరిస్థితి లేదట. రోజుకో వివాదం ఇప్పుడు నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌ను వేడెక్కిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరూ నెల్లూరు ఏసీ సెంటర్‌ వేదికగా దశాబ్దాలపాటు రాజకీయం చేశారు. రామనారాయణరెడ్డి మంత్రిగా కీలక శాఖలు నిర్వహించారు కూడా. వివేకానంద చనిపోయిన తర్వాత.. జిల్లాలో రామనారాయణరెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆనం సోదరులు కుటుంబపరంగా కలిసి ఉన్నా.. రాజకీయంగా ఎవరిదారి వారు చూసుకున్నారు. రామనారాయణరెడ్డి సైతం నెల్లూరు సిటీని వదిలి.. వెంకటగిరికి పరిమితం అయ్యారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే అయినా గత వైభవం లేదు.

ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పిందే నడుస్తోందట. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సైతం మరొకరి పొడగిట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకప్పుడు వీరిద్దరూ ఆనం శిబిరంలోనే ఉండేవారు. తర్వాత వారికి బద్దశత్రువులుగా మారిపోయారు. ఆనం వెంట నడిచిన కేడర్‌ సైతం మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శిబిరాల్లోకి చేరిపోయింది. అనిల్‌, ఆనం వర్గాల మధ్య గతంలో నుంచి నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో లెవల్‌కు చేరుకుంది. నెల్లూరులో ఆనం ఆనవాళ్లు లేకుండా చేయాలని ఓ శిబిరం ఆలోచనగా ఉందట.

అయితే ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పట్టాయి. ఆనం వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట్‌ పెంచాయి. నెల్లూరు ప్రజల నుంచి తమ కుటుంబాన్ని ఎవరూ దూరం చేయలేరని ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి ఘాటైన కామెంట్స్‌ చేశారు. తామేమీ ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరికే పరిమితం కాలేదని..ఇకపై నెల్లూరు నగరంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటూనే కొద్దిరోజుల్లో నెల్లూరులో గడప గడపకు వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు రామనారాయణరెడ్డి. వైసీపీలో తమ వ్యతిరేకులను ఉద్దేశిస్తూనే ఒకింత హెచ్చరిక ధోరణిలోనే ఆనం ఈ కామెంట్స్‌ చేశారని అనుకుంటున్నారట.

ఆనం రామానారాయణరెడ్డి చేసిన ఆ ఘాటు కామెంట్స్‌ గురించి తెలుసుకున్నారో ఏమో.. మంత్రి అనిల్‌ వెంటనే బదులిచ్చేశారు. నెల్లూరేమీ తన సొంత జాగీరు కాదంటూనే ఎవరైనా ఇక్కడ గడప గడపకు తిరగొచ్చని కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ బలోపేతానికి ఎవరైనా కృషి చేయొచ్చని అంటూనే.. సీఎంకు నష్టం కలిగించే ఆలోచన చేస్తే అప్పుడు స్పందిస్తామని తనదైన శైలిలో సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు మంత్రి అనిల్‌. ఈ వివాదం నలుగుతున్న సమయంలోనే నగరంలో ఏర్పాటు చేసిన ఆనం వివేక జయంతి ఫ్లెక్సీలను గంటల వ్యవధిలోనే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆనం వివేక కుమారుడు రంగమయూర్‌రెడ్డి మున్సిపల్‌ సిబ్బందిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

నేతల మాటలు మెత్తగానే ఉన్నా.. వాటి వెనక అర్ధం మాత్రం సుత్తితో కొట్టినట్టు ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. మరి.. రానున్న రోజుల్లో నెల్లూరు రాజకీయం, అందులోనూ ఆనం రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో..ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news