ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ ఆటపై సరిగా దృష్టిపెట్టడం లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారు పెట్టించిన భారత క్రికెట్ జట్టు ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల చేతిలో ఓడిపోయింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో చిత్తయింది. రేపు ఇదే వేదికపై రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.
కోహ్లీ సారథ్యంలో గత నాలుగు టెస్టుల్లో భారత్ ఓడింది. అదేసమయంలో రహానే ఆస్ట్రేలియా పర్యటనలో జట్టును విజయపథంలో నడిపించాడు. వరుసగా మ్యాచుల్లో విఫలమవుతుండటంతో కెప్టెన్ కోహ్లీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ లవర్స్. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ట్రోల్స్ చేస్తున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్ సరిగ్గా ఆడలేకపోతోందని అన్నారు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.
ఆల్‌టైమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడని.. కానీ, అతడి కెప్టెన్సీలో భారత్ సరిగ్గా ఆడటం లేదనిపిస్తోంది అన్నారు. అతడి కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఓడిపోవడం చూశామని.. అదేసమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమోనని కామెంట్స్ చేశాడు పనేసర్.