ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల టెన్షన్..జగన్ మాటతో వెనక్కి తగ్గినట్టేనా

-

ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల టెన్షన్ పట్టుకుంది. గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనా పరంగా.. రాజకీయంగా మంచి ఫలితాలు సాధించవచ్చనేది ప్రభుత్వ పెద్దల వ్యూహం. వివిధ అంశాల్లో తప్పొప్పులు జరుగుతున్నా.. గ్రామ స్థాయిలో బలమైన వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి ఇబ్బందేమీ ఉండదనే భావన ఉండేది. కానీ ఉన్నట్లుండి వాలంటీర్లు రోడ్డెక్కడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగక తప్పని సరైంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చిన అతి పెద్ద సంస్కరణలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు అతి ముఖ్యమైన అంశం. గ్రామాల్లో ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలను చేర్చడానికి.. ప్రజలకు- ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు వాలంటీరును నియమించడం ద్వారా, ప్రభుత్వం కూడా ఏదైనా డేటాను సమీకరించుకోవాలనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని గంటల్లో సేకరించుకోగలిగే పరిస్థితి ఉండేది.

ఓ విధంగా వాలంటీర్ల వ్యవస్థ జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎస్సెట్. గతంలో జన్మభూమి తరహా కమిటీలు ఏర్పాటు చేస్తే, టీడీపీ మీద వచ్చిన విమర్శలే మళ్లీ వస్తాయనే ఉద్దేశ్యంతో పార్టీతో సంబంధం లేకుండానే వాలంటీర్ల వ్యవస్థను రూపొందించారు. పార్టీ కేడరును కూడా కాదని, వాలంటీర్లకే అన్ని రకాల బాధ్యతలు.. హక్కులు కట్టబెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళన చేయడం ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. గ్రామ స్థాయిలో కీలకంగా ఉండే వలంటీర్లు, జీతాల పెంపు కోసం రోడ్డెక్కడం ప్రభుత్వంలో ఎవ్వరూ ఊహించని పరిణామం.

తేరుకున్న ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలక మార్పులు..చేర్పులు చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది జగన్ సర్కార్. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేటును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ కోసం కమిషనరేటును ఏర్పాటు చేసింది. ఈమేరకు ఏపీ ఫైనాన్షియల్ కోడ్ లో సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్. ఈ క్రమంలో ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి కమిషనరేట్ కార్యాలయం విభాగాధిపతిగా ఉంటుందని స్పష్టం చేసింది సర్కార్.

మరోవైపు స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. వాలంటీర్లను ఉద్దేశించి బహిరంగ లేఖ రాస్తూ గతంలో చెప్పిన అంశాలను ప్రస్తావించారు. సేవ చేయడం కోసమే వాలంటీర్లను విధుల్లోకి తీసుకున్నామని.. గౌరవ భత్యం ఇచ్చి వాలంటీరును గౌరవిస్తున్నామని గుర్తు చేశారు జగన్. వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించే సందర్భంలోనే గౌరవ భృతి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానని.. మంచి ఉద్యోగం లభిస్తే వెళ్లిపోవాలని స్పష్టంగా చెప్పాననే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు జగన్.

ఇక ఇదే అంశంపై హెచ్వోడీల సమావేశంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్. వచ్చే ఉగాది నుంచి ప్రతి రోజూ రోజుకో నియోజకవర్గంలో వాలంటీర్ల సత్కార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు.. ఎస్పీలు, జేసీలు పాల్గొనాలని సూచించారు. వాలంటీర్లు చేసేది సేవే కానీ.. ఉద్యోగం కాదనే విషయాన్ని హెచ్వోడీల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్.

సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత మేర కంట్రోల్లోకి వచ్చినట్టే కన్పిస్తోంది. ఆవేశంతో ఉన్న వలంటీర్లు శాంతించినట్టే కన్పిస్తోన్నా.. అది తాత్కాలికమా..లేక ముఖ్యమంత్రి మాటలతో పూర్తి స్థాయిలో శాంతించారా అనేది కొన్నాళ్లు ఆగితేనే కాని స్పష్టత రాదని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news