వ్యాక్సిన్ వృధాని అరికట్టే కొత్త సిరంజీలు.. LDS గురించి తెలుసుకోండి.

భారతదేశం కరోనా సెకండ్ వేవ్ తో పోరాడుతుంది. మొదటి వేవ్ కన్నా ఉధృతంగా ఉన్న సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది దీని బారిన పడ్డారు. మరణాల రేటు కూడా సెకండ్ వేవ్ లో ఎక్కువగా ఉంది. అదలా ఉంటే, ఈ సమయంలో కరోనా నుండి కాపాడడానికి వ్యాక్సిన్ ఒక్కటే అసలైన మందు అని ప్రభుత్వం కూడా నిశ్చయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. 18నుండి 45ఏళ్ళలోపు వారికి వ్యాక్సిన్ వేస్తామని అన్నారు కానీ, పెద్ద మొత్తంలో అమలు కాలేదు.

వ్యాక్సిన్ కొరత ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత సమయంలో వ్యాక్సిన్ వృధా మరో సమస్యగా మారింది. సిరంజీలతో ఒకరికి వ్యాక్సిన్ ఇచ్చినపుడు అందులో మిగిలిపోయే వ్యాక్సిన్ ని వృధా అంటారు. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అరికట్టడానికి ఎల్ డీ ఎస్ అనే సిరంజీలు వచ్చాయి. లో డెడ్ స్పేస్ గా ఉండే ఈ సిరంజీలలో వ్యాక్సిన్ మిగిలిపోదు. అంతేకాదు దాన్నుండి సూదిని తీసివేసి మరో సూది పెట్టుకునే అవకాశం ఉంది. దానివల్ల వ్యాక్సిన్ వృధా తగ్గి, ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయవచ్చు.

ఈ విధంగా చేస్తే దాదాపుగా 20శాతం ఎక్కువ మందికి వ్యాక్సిన్ దొరుకుతుంది. అంటే ఉదాహరణకి సాధారణ సిరంజి ద్వారా కోటి మందికి వ్యాక్సిన్ వేయగలిగితే, ఈ లో డెడ్ స్పేస్ సిరంజి ద్వారా కోటి 20లక్షల మందికి వ్యాక్సిన్ వేయవచ్చన్నమాట. దానివల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ టెక్నాలజీని ఉత్తరప్రదేశ్ జిల్లాల్లో వాడుతున్నారు. మరికొన్ని రోజుల్లో చెన్నైకి కూడా ఈ సిరంజీలు రానున్నాయి. వ్యాక్సిన్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో లో డెడ్ స్పేస్ సిరంజీల వాడకం చాలా ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు.