మరో నాలుగేళ్ల పాటు తెలంగాణలో ఏ కొత్త ఎన్నిక జరిగినా అధికార టీఆర్ఎస్‌కు తిరుగులేని పరిస్థితే కనిపిస్తోంది. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు తిరుగులేని బలం ఉండడంతో ఏ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినా.. రాజ్యసభ ఎన్నిక జరిగినా కూడా అన్ని సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనున్నాయి. ఈ విషయంలో విపక్ష కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి కాదు కదా ? కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ మండలిలో త్వరలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాలకు కొత్త ఎమ్మెల్సీలు ఎవరు అవుతారా ? ఆన్న ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో సహజంగానే ఏర్పడింది.
మూడు సీట్లు ఖాళీగా ఉంటే ఆశావాహుల లిస్ట్ మాత్రం చాలానే ఉంది. కేసీఆర్‌కు సన్నిహితులు అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనా చారి, ఇక తెలంగాణ తొలి కేబినెట్లో హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, కర్నే ప్రభాకర్ ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో నాయిని, ప్రభాకర్ పదవీ కాలం కొద్ది రోజుల క్రితమే పూర్తి కావడంతో వీరికి రెన్యువల్ ఉంటుందా ? లేదా ? అన్నది సందేహంగా మారింది.
ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. నాయిని అల్లుడికి గత ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. ఇక నాయిని రాజ్యసభ వస్తుందనుకున్నా రాలేదు. పైగా కేసీఆర్‌పై గరం గరం లాడుతున్నాడు. దీంతో నాయిని పేరు బలంగా పరిశీలనకు రావొచ్చు. ఇక మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. అయితే ఆయన స్థానిక ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను నిలబెట్టడం ఆయనకు మైనస్.
ఇక కమ్మ వర్గానికి మండలిలో చోటు ఇవ్వాల్సిన నేపథ్యంలో మాజీ మంత్రి, కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు అయిన తుమ్మల నాగేశ్వరరావు పేరు బలంగా ఉంది. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో క్వార్టర్ ఖాళీ చేసేందుకు రెడీ అవ్వగా… వద్దని కేసీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కమ్మ వర్గాన్ని ఆకర్షించేందుకు తుమ్మలకు మళ్లీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటున్నారు. మరి కేసీఆర్ మదిలో ఎవరెవరు ఉన్నారో ? ఆయనకే ఎరుక..?