కరోనా నేపథ్యంలో గృహాపకరణాలకు భారీ డిమాండ్..!​

-

కొవిడ్‌ దెబ్బతో ప్రజల జీవనవిధానం మారిపోయింది. ఏవి కొనుగోలు చేయాలన్న ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​.. గృహోపకరణాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రధానంగా సినిమా హాళ్లు మూత పడటం వల్ల వినోదం కోసం ప్రజలు ఇంటినే ఒక సినిమా హాలుగా మార్చుకుంటున్నారు. డబ్బున్న వారు హోమ్‌ థియేటర్‌ సమకూర్చుకుంటుంటే.. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు పెద్ద స్క్రీన్లు ఉన్న టీవీలను కొంటున్నారు. కరోనా వల్ల పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ఓటీటీ విధానంలో రిలీజ్‌ చేస్తుండడం వల్ల వాటిని ఇంటి వద్ద నుంచే చూడటానికి అనువుగా పెద్ద స్క్రీన్ల టీవీల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

HOME-APPLIANCES
HOME-APPLIANCES

గతంలో ఎల్‌ఈడీ టీవీ అమ్మకాల్లో 32 అంగుళాలవి ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు 43 అంగుళాలు, అంత కంటే ఎక్కువ సైజు ఉన్న టీవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని సేల్స్​ ప్రతినిధులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే హోమ్‌ థియేటర్ల అమ్మకాలు 50 శాతం పెరగ్గా, పెద్ద ఎల్‌ఈడీ టీవీల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెరగడం వల్ల ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశంలో రికార్డు స్థాయిలో 5.43 కోట్ల మొబైల్‌ ఫోన్లు దిగుమతి అయ్యాయంటే డిమాండ్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా మహమ్మారి భయంతో చాలా మంది పని మనుషులకు టాటా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా డిష్‌ వాషర్లకు, వాషింగ్​ మెషీన్లకు డిమాండ్‌ పెరిగింది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో దసరా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం వరకు వృద్ధి నమోదైంది. దీంతో దీపావళి పండగ అమ్మకాలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, స్క్రాచ్‌ కార్డుల వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news