ఆగస్టు నెల చివరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావు. ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకోసం గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అన్ని రకాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు రూ.6 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి, పనులు మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో ఇప్పటికే విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలను అధికార బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఈ నివేదికపై అరణ్య భవన్ లో శనివారం ఆరోగ్య శాఖ మంత్రితో ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి , హెల్త్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి , నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్లు, ఆఫీసర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. తెలంగాణ, హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుందన్నారు. అయితే ప్రకృతి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా.. హైదరాబాద్ కే వచ్చేలా గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను తీర్చిదిద్దాలని ఆదేశించారు.
కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు సైతం ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రి లో నాచురోపతి ఒపి , ఐపి సేవలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి వైద్యానికి తగిన విధంగా ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు. ప్రకృతి వైద్యంలో ప్రత్యేక భోజన డైట్ ఉంటుందనివాటికి కావాల్సిన వంట గది, ఇతర సామగ్రి సమకూర్చాలన్నారు. వచ్చే రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యుల ను సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.