కరోనా బారిన పడిన వారికి ఎమర్జెన్సీ చికిత్స అవసరమా, కాదా.. అవసరం అయితే ఎప్పుడు చికిత్సను అందించాలి ? వంటి వివరాలు సరిగ్గా తెలియడం లేదు. దీంతో కోవిడ్ ఎమర్జెన్సీ ఉన్నవారికి చికిత్సను అందించడంలో ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా రోగులు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కోవిడ్ రోగులకు ఎమర్జెన్సీ చికిత్స అవసరం అవుతుందా, కాదా ? అనే వివరాలను ఇకపై సాఫ్ట్‌వేరే తెలుపుతుంది. దీంతో రోగులకు వెంటనే అత్యవసర చికిత్సను అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చు.
కరోనా రోగులకు ఎమర్జెన్సీ చికిత్స అవసరం అవుతుందా, కాదా అనే వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని కోల్‌కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ హెల్త్, సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ డివిజన్ లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్లెట్ పీసీలో లోడ్ చేస్తారు. అందులో రోగికి చెందిన పూర్తి వివరాలను ఎంట్రీ చేస్తారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌లో ఉండే అల్గారిథం రోగికి చెందిన వివరాలను విశ్లేషిస్తుంది. రోగికి ఎమర్జెన్సీ చికిత్స ఎప్పుడు అవసరం అవుతుందో స్పష్టంగా చెబుతుంది. దీంతో ఆ సమయంలోగా కరోనా రోగికి చికిత్సను అందించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. దీని వల్ల కోవిడ్ బారి నుంచి ఎంతో మందిని రక్షించవచ్చు.
కాగా ఈ సాఫ్ట్‌వేర్ గురించి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన చేయగా దీన్ని ఇప్పటికే కోల్‌కతాలోని మూడు హాస్పిటళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లకు అందివ్వనున్నారు. దీని వల్ల ఒక కరోనా రోగికి ఎమర్జెన్సీ చికిత్స ఎప్పుడు అందివ్వాలి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా బెడ్‌లను సిద్ధం చేసి చికిత్సను అందించవచ్చు. ముందస్తుగా సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతంలో ఉన్న డాక్టర్ కూడా కోవిడ్ రోగుల వివరాలను, స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో వారు రోగిని చేరుకునే లోగానే వారు సూచించిన విధంగా రోగులకు చికిత్సను అందించేందుకు వీలు కలుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో చాలా మందికి ఎమర్జెన్సీ అవడం, బెడ్‌లు, వైద్య సదుపాయాలు లభించకపోవడంతోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు సదరు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపింది.