దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీ వాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3వేల ఆలయాలను నిర్మిస్తున్నామని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు.
అధికారులతో సమీక్ష అనంతరం శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున 1,072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అన్నారు.
వీటిలో 936 చోట్ల ఆలయాలను నిర్మించేందుకు భూమిని గుర్తించామని చెప్పారు. వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారానే మరో 330 ఆలయాల నిర్మాణం హిందూ ధార్మిక సంస్థ సమరసత ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఇవి కాకుండా మరో 1,568 ఆలయాల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.