రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధాలు ఉండవని అంటారు. పరోక్షంగా తాము చేయాల్సినవి చేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందడం, తమ చేతులకు మట్టి అంటకుండానే ఎదుటి పక్షాన్ని దెబ్బతీయడం అనేది రాజకీయాల్లోఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా అందెవేసిన చేయి అనేలా వ్యవహరించాయి. అయితే, ఇటీవల కాలంలో దాదాపు అన్నీ ప్రత్యక్ష యుద్ధాలే కనిపిస్తున్నాయి. పార్టీలను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు వేస్తున్న ఎత్తులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.
అవి జాతీయ పార్టీలైనా.. ప్రాంతీయ పార్టీలైనా కూడా ఒకటే అనే రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్నాయి. అయితే, తాజాగా కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం మళ్లీ మొదటి పంథాలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన కొన్నాళ్లుగా ఏపీపై దృష్టి పెట్టిన బీజేపీ పెద్దలు.. ఇక్కడ తమకు ఓటు బ్యాంకు లేకపోయినా.. నాయకులు గెలుపు గుర్రాలు ఎక్కక పోయినా కూడా తమదే హవా! అనే రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే.
వాస్తవానికి ఏపీలోని ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా సహా ఏ హామీని ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఇక, తాజాగా పరోక్షంగా ఏపీలో అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ, ఏపీ విషయానికి వస్తే.. ఏ ఒక్కరూ లేరు.
అయితే, టీడీపీ రాజ్యసభ సభ్యులను నలుగురిని తమ పార్టీలో చేర్చుకున్నా.. ఆశించిన విధంగా వారికి ఫలితం కనిపించడం లేదనే ప్రచారం ఉంది. పైగా, పార్టీ మారిన వారు ప్రతిపక్షానికి చెందిన నాయకులు కావడం కూడా బీజేపీకి మైనస్‌గా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులను, గెలిచిన ఎంపీలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరు వీక్‌గా ఉంటారో చూసుకుని వారికి గేలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అటో అడుగు, ఇటో అడుగు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఆయనపై దుమారం చెలరేగడం, దానికి ఆయన వివరణ ఇవ్వడం, అంతా తూచ్! అనడం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఏకంగా బీజేపీ పార్లమెంటరీ ఆఫీస్ కే వెళ్లడం, దీనిపై అటు విజయసాయి రెడ్డికికానీ, ఇటు మిథున్‌రెడ్డికి కానీ సమాచారం ఇవ్వకపోవడంతో వైసీపీకి బీజేపీ నేతలు చేస్తున్న తెరచాటు వ్యవహారం తలనొప్పిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎటు దారి తీస్తుందో చూడాలి.