చీరాలలో ఉన్న రెండు గ్రూపుల వర్గపోరుతోనే చుక్కలు చూస్తున్న వైసీపీకి మరో కొత్తరాగం షాక్ కి గురి చేస్తోందట..వైసీపీ కండువా కప్పుకొని ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన మరో నేత కూడా చీరాల పైనే మనసుపారేసుకోవడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడుతున్నారట..ప్రకాశం జిల్లా అధికారపార్టీలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.
వైసీపీ కండువా కప్పుకొని ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన పోతుల సునీత పార్టీ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. చీరాల వైసీపీ ఇంఛార్జ్ పదవి తనకే ఇవ్వాలని వైసీపీ పెద్దల దగ్గర డిమాండ్ పెట్టారట. హాట్ హాట్‌గా ఉంటోన్న చీరాల వైసీపీ రాజకీయంలో ఈ సరికొత్త పరిణామం అక్కడి రాజకీయాన్ని మరింత వేడెక్కించిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో వైసీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయనపై గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరామ్ సైతం సీఎం జగన్‌కు జై కొట్టారు. అప్పటి నుంచి చీరాలలో ఆమంచి, కరణం వర్గాల మధ్య రాజకీయం ఉప్పు నిప్పుగా ఉంది.
ఇప్పటికే దాడులు, ఘర్షణలతో అక్కడి రాజకీయ వాతావరణం అట్టుడుకుతోంది. ఇక్కడ విపక్షానికి పెద్దగా ఛాన్స్ లేకుండా పోయింది. ఆ లోటు లేకుండా తీర్చేస్తున్నారు ఇక్కడి వైసీపీ నేతలు. గతంలో చీరాల నుంచి పోటీ చేసి ఓడిన పోతుల సునీత ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ పంచన చేరిపోయారు. దీంతో చీరాల వైసీపీ మూడు వర్గాలుగా మారిందని అనుకున్నా.. ఆమంచి, కరణం బలంగా ఉండటంతో పెద్దగా ఉనికిలో లేకుండా పోయారు సునీత. ఇంతలో సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయడం.. దానిపై శాసనమండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిసి.. ఆగమేఘాలపై ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అధికార పార్టీలో చేరిన సంతోషం.. పదవి పోవడంతో ఆవిరైపోయిందట.
చీరాల వైసీపీ ఇంఛార్జ్ పదవిని కరణం వెంకటేష్‌కు ఇప్పించాలని పావులు కదుపుతున్నారు ఎమ్మెల్యే బలరామ్. ఇంతలో ఆమంచిని పర్చూరు వెళ్లమని అధిష్ఠానం సూచించినట్టు ప్రచారం జరిగింది. దానికి ఆమంచి ఒప్పుకోలేదని సమాచారం. దాంతో చీరాల వైసీపీలో పీఠముడి పడింది. ఈ వివాదం ఇలా ఉండగానే.. రేస్‌లో తాను వెనకబడుతున్నట్టు భావించారో ఏమో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన అస్త్రలను బయటకు తీశారు. వైసీపీలో చేరిన తర్వాత తన ఎమెల్సీ పదవిని త్యాగం చేసినందున చీరాల వైసీపీ ఇంఛార్జ్ పదవి తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ పదవి కూడా లేదు కాబట్టి చీరాల ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చి తనకి గౌరవం కల్పించాలని కోరుతున్నారట. ఇన్ ఛార్జ్ పదవి ఇస్తే నియోజక వర్గంలో చెప్పుకుని తిరిగేందుకు పదవి ఉంటుందని పోతుల సునీత భావిస్తున్నారట. ఇప్పటికే చీరాల ఇన్ ఛార్జ్ పదవి వ్యవహారంలో కరణం, ఆమంచి మధ్య పోటీ గట్టిగానే ఉందట. ఇద్దరు నేతల పోటీ మధ్య చీరాల ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు పోతుల సునీత వైసీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే వరుస వివాదాలతో కరణం, ఆమంచి వర్గాలకు సర్దిచెప్పలేక పోతున్న అధికార పార్టీనేతలకు ఇప్పుడు మరో గ్రూప్ ఎంట్రీతో తల బొప్పికట్టిందట. ఈ సమస్యను వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి….