ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఫేస్‌బుక్ లో యూజర్ల డేటాను ఎప్పటికప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చోరీ చేసి ఉపయోగించుకుంటున్నారు. అయినప్పటికీ ఫేస్‌బుక్ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక తాజాగా బిట్‌కాయన్ పేరిట ఓ సరికొత్త స్కాం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే…
కొందరు దుండగులు బిట్‌కాయిన్ పేరిట ఫేస్‌బుక్ యూజర్లకు చెందిన డేటాను పెద్ద ఎత్తున తస్కరించారు. యూజర్లకు ఉచితంగా బిట్‌కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తామని, అందులో ట్రేడింగ్ ప్రారంభించేందుకు ముందుగా 250 యూరోలను ఉచితంగా జమ జేస్తామని ఆశ పెట్టారు. అనంతరం యూజర్లు సదరు వ్యక్తులు ఇచ్చిన లింక్‌లను ఓపెన్ చేసి తమ ఫేస్‌బుక్ అకౌంట్లతో వాటిల్లో లాగిన్ అయ్యారు. అదే సమయంలో దుండగులు యూజర్లకు చెందిన ఫేస్‌బుక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించారు. వాటి సహాయంతో యూజర్లకు చెందిన డేటాను దుండగులు చోరీ చేయగలిగారు. ఆ డేటా సహాయంతో దుండగులు ఐడీ థెఫ్ట్, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లకు పాల్పడుతున్నట్లు ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చింగ్ కంపెనీలు వెల్లడించాయి.
ఇక ఇదే కాకుండా ఫేస్‌బుక్ లో యూజర్లకు చెందిన ప్రొఫైల్‌ను ఎవరు చూశారో తెలుసుకోండి.. అంటూ కొందరు దుండగులు కొన్ని లింక్‌లను ప్రచారం చేశారు. వాటిని యూజర్లు ఓపెన్ చేసి తమ ఫేస్‌బుక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవగానే.. పైన చెప్పిన విధంగా దుండగులు యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని సేకరించారు. అనంతరం వారి డేటాను దొంగిలించారు. ఇలా రెండు రకాలుగా మొత్తం 2 లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్లకు చెందిన డేటా చోరీ అయినట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు తెలిపారు.
అయితే ఈ విధంగా దుండగులు జూన్ నుంచి సెప్టెంబర్ నెల మధ్య కాలంలో ఫేస్‌బుక్ డేటా చోరీకి పాల్పడి ఉంటారని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ యూజర్లు అలాంటి లింక్‌లను ఓపెన్ చేయకూడదని, అలాగే తమ అకౌంట్‌కు టు-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఫేస్‌బుక్ అకౌంట్లకు రక్షణ లభిస్తుంది.