ఏపీలో అధికార వైసీపీలో రోజు రోజుకు నేతల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోంది. చాలా ఏళ్లు కష్టపడి జగన్మోహన్‌రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఆ పార్టీ నేతలు మాత్రం ఒకరినొకరు విమర్శించుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి అనంతపురం జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ఆ పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించి వరాలు ప్రకటించారు. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ వర్సెస్ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. ప్రొటోకాల్ సమస్య కారణంగా హెలీకాప్టర్ లో వచ్చిన జగన్ ను స్వాగతించడానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అనుమతించకపోవడం తెలిసిందే. దీనిపై ఆయన మంత్రి శంకరనారాయణతో పెద్దారెడ్డి వివాదం పెట్టుకున్నారు. నా నియోజకవర్గంలో నీకు పనేంటని ఆయన తీవ్ర వాగ్వివాదానికి దిగారు.
ఈ వివాదం ఇలా ఉంచితే ఈ పర్యటన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మరో మంత్రికి సైతం చేదు అనుభవం మిగిల్చింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా పాల్గొన్నారు. జగన్ ఓ వైపు స్టాల్స్ ప్రారంభిస్తుండగా ఆయనతో కలిసి నడుస్తున్న డిప్యూటీ సీఎం, మంత్రి ఆళ్ల నానిని సీఎం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఇక సీఎంతో పాటు పక్కనే నడిచేందుకు ప్రయత్నించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సైతం భద్రతా సిబ్బంది పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో అటు నానితో పాటు ఇటు మాధవ్ ఇద్దరు చిన్నబుచ్చుకున్నారు. పక్కనే ఉన్న పార్టీ నేతలు వారికి సర్దిచెప్పారు.