హైదరాబాద్‌లో ఉగ్రకుట్రలు.. అప్రమత్తమైన ఎన్‌ఐఏ

-

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్‌.. హుమాయున్‌నగర్‌ వాసి మాజ్‌హసన్‌ ఫరూఖ్‌, సైదాబాద్‌ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటు మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.

ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్‌వింగ్‌ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు. విడుదలయ్యాక కూడా జాహెద్‌ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Latest news