సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూసిన సినిమా ‘కార్తికేయ 2’. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. విజయవంతమైన ‘కార్తికేయ’కు కొనసాగింపు. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
కథేంటంటే: కార్తికేయ (నిఖిల్) ఓ వైద్యుడు. ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. ప్రతి సమస్యకీ ఓ సమాధానం ఉంటుందని, తన దగ్గరికి రానంత వరకే ఏదైనా సమస్య అనీ.. వస్తే మాత్రం దానికి సమాధానం దొరకాల్సిందేనని అంటాడు. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణించే వ్యక్తిత్వం అతడిది. మొక్కు తీర్చడం కోసమని అమ్మతో కలిసి ద్వారక వెళతాడు. అనుకోకుండా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురికావడం, దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) ఎవరు? కార్తికేయ ప్రయాణానికీ, శ్రీకృష్ణతత్వానికీ సంబంధమేమిటనేది తెరపైనే చూడాలి.
ఎవరెలా చేశారంటే: నిఖిల్ తొలి సినిమాలో మెడికోగా ఎంత గాఢత కలిగిన పాత్రలో ఒదిగిపోయాడో.. ఈ సినిమాలోనూ అంతే. వైద్యుడిగా.. ప్రశ్న చుట్టూ ప్రయాణం చేసే వ్యక్తిగా.. ఈ కథని తన భుజాలపైనే మోశాడు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మేనన్ తదితరుల పాత్రలు కూడా ప్రభావం చూపిస్తాయి. శ్రీనివాస్‌రెడ్డి, వైవా హర్ష అక్కడక్కడా నవ్వించారు. తులసి, ప్రవీణ్, సత్య చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం, కాలభైరవ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. కళా విభాగం కూడా చక్కటి పనితీరుని కనబరిచింది. దర్శకుడు చందు మొండేటికి ‘కార్తికేయ’ తొలి సినిమా. దాన్ని ఎంత శ్రద్ధగా, ప్రేమతో తీశారో ఈ సినిమాపై కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. నిర్మాణం బాగుంది.
ఎలా ఉందంటే: కథానాయకుడి పాత్ర, అతడి వ్యక్తిత్వం మినహా.. తొలి భాగం కథకీ, దీనికీ సంబంధమేమీ ఉండదు. ఈసారి శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ కథను అల్లాడు దర్శకుడు. దైవం, మానవత్వం వంటి విషయాలను చెబుతూనే కథానాయకుడి సాహస ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో చిత్రబృందం సఫలమైంది. కథానాయకుడు ద్వారక వెళ్లినప్పట్నుంచీ కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటివరకు కథ మాములుగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి చివరి వరకు ఉత్కంఠ కొనసాగేలా చేశాడు దర్శకుడు. కొనసాగింపు చిత్రం కాబట్టి తొలి భాగానికి దీటుగా ఉండేలా.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా విస్తృతమైన పరిధి ఉన్న కథని ఎంచుకోవడం కలిసొచ్చింది. కథా నేపథ్యం, దానికి తగ్గ సాంకేతిక హంగులు కూడా చక్కగా జోడించడం వల్ల కథ ఓ కొత్తదనాన్ని పంచుతుంది. క్లైమాక్స్ సీన్స్ పార్ట్-3కి సంకేతాలు ఇచ్చాయి.