మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. న్యాయస్థానం తనను నియమించమని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తనను నియమించడంలేదని నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా తనను కాపాడాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బుధవారం రాత్రి ఒక లేఖ రాసారు. గవర్నర్‌కు రాసిన లేఖలో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారన్నారు. ఎక్కడకు వెళ్లినా పలువురు పోలీసులు వెంటాడుతున్నారన్నారు. అలాగే హైకోర్టు తీర్పును అనుసరించి.. తన విధులను నిర్వహించుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం లేదని.. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని వివరించారు. వెంటనే తమ జోక్యం అవసరమని, తనను కాపాడాలని రమేష్ కుమార్ వేడుకున్నారు. అయితే.. ఆ లేఖపై గవర్నర్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.