ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ముదురుతోంది. నిన్న రాత్రి ఏపీ సీఎస్ నీలం సహానీ రాసిన లేఖకు సమాధానం గా ఆమెకు ఘాటుగా ఎస్ఎంఎస్ పెట్టారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని ఎలా ప్రశ్నిస్తారు అంటూ ఆ ఎస్ఎంఎస్ లో ఆయన నిలదీశారు. అంతకు ముందు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదని, కరోనా కారణంగా అధికారులు సమావేశానికి హాజరు కారని స్పష్టం చేస్తూ నీలం సహానీ ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు.
ఈ రోజు మధ్యాహ్నం జిల్లా యంత్రాంగాలతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సమావేశాలు అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. లేఖ పూర్తిగా అభ్యంతరకరంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెబుతూ ఎస్ఎంఎస్ ద్వారా ఆయన పంపిన రిప్లైలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ ను ఎన్నికల కమిషనర్ కలవనున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.