ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం మరో సారి నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వంగా మారింది. కోర్టులో రిట్ పిటిషన్ వేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు నిమ్మగడ్డ రమేశ్‍కుమార్.
అయితే నిమ్మగడ్డ పిటిషన్ వేసిన వెంటనే రూ.39 లక్షలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఎస్‍ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్‍ఈసీ తమను సంప్రదించాలని ప్రభుత్వ న్యాయవాది సూచించగా మేం గమనిస్తే తప్పేంటని ప్రశ్నించారు న్యాయమూర్తి. ఎస్‍ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని ప్రభుత్వ వైఖరితో హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరమన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్‍ను దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది.