దేశ రాజధాని ఢిల్లీలో 16 డిసెంబర్ 2012 న ఓ వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆమె 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న తుదిశ్వాస విడిచారు. ప్రజలందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాడేలా చేసిందీ ఘటన. అయితే నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఎనిమిదేళ్లయినా ఇంతవరకూ దోషులను ఉరితీయలేదు. అయిటే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో మళ్లీ నిర్భయ కేసు తెరపైకి వచ్చింది. ఇక ఇప్పటికే పలు సార్లు నిర్భయ దోషుల ఉరి వాయిదా పడింది. అయితే ఇటీవల కోర్టు ఆదేశాల ప్రకారం.. నిర్భయ దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. నలుగురు దోషులు ముకేశ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ను ఒకేసారి శిక్ష అమలుచేయనున్నారు.
ప్రస్తుతం ఉరి తీసేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. దీంతో ఉరి శిక్ష నుంచి తప్పించుకొనేందుకు నిందితులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్భయ కేసు మరో మలుపు తిరింగింది. తమకు విధించిన ఉరి శిక్షను తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తోన్న నిర్భయ దోషులు తాజాగా మరో ట్విస్టు ఇచ్చారు. దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తాజాగా సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతూ అతడు ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతడి తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. దీంతో మార్చి 3న అయినా వీళ్లకు ఉరి పడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతుంది.