లీప్‌ సంవత్సరం అంటే ఏంటో తెలుసా?

-

ప్రతి నాలుగేళ్లకోసారి ఒక రోజు ఎక్కువగా రాకపోతే కాలాలు గతి తప్పుతాయి. ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.

మామూలుగా మన క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరం 365 రోజులుంటాయి. ఈ క్యాలెండర్‌ను గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ అంటారు.ఈ 365రోజుల ఏడాదిని సాధారణ సంవత్సరంగా పిలుస్తారు.  ప్రపంచమంతా దాదాపు దీన్నే అనుసరిస్తుంది. అంటే, మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి పట్టే సమయమే ఒక సంవత్సరం . నిజానికి ఇది 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే, 365.242189 రోజులు. ఇంకా కరెక్ట్‌గా అంటే, 365 రోజుల 5 గంటల, 48 నిమిషాల, 45 సెకండ్లు. క్యాలెండర్‌ రోజుల కంటే దాదాపు 6 గంటలు ఎక్కువ సమయం ఇది. దీన్ని ట్రాపికల్‌ సంవత్సరం అని వ్యవహరిస్తారు. దీనివల్ల మన క్యాలెండర్‌లో సంవత్సరం సూర్యుడు తన భ్రమనాన్ని పూర్తిచేయడానికి 6 గంటల ముందే కొత్త ఏడాది ప్రారంభమవుతుంది.

సూర్యుడి గమనాన్ని బట్టే మనకు కాలాలు, రుతువులు ఏర్పడతాయి.అంటే, ట్రాపికల్‌ ఇయర్‌ను అనుసరించి.  ఇలా 6 గంటలు ముందుగానే కొత్త ఏడాది మొదలైతే, కొంతకాలానికి రుతువులు, కాలాలు గతి తప్పి ఎండాకాలం స్థానంలో వానాకాలం, వానాకాలం స్థానంలో చలికాలం..ఇలా వస్తాయి. దానివల్ల ప్రజలు అయోమయానికి గురవుతారు. ఈ గందరగోళాన్ని నివారించడానికి, అధికంగా ఉన్న ఆరు గంటలను సవరించడానికి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజును ( 6 గంటలు గ 4 ఏళ్లు = 24గంటలు=ఒకరోజు) అధికంగా ఆ ఏడాదికి కలుపుతారు. తద్వారా ఆ సంవత్సరం 366 రోజులను కలిగిఉంటుంది. ఇలా 366రోజులు ఉన్న ఏడాదిని ‘లీపు’ సంవత్సరంగా పిలుస్తారు. దీన్నే ఇంటర్‌కాలెరీ ఇయర్‌గా కూడా వ్యవహరిస్తారు.

ఇలా మనకు మూడు రకాల సంవత్సరాలు ఉంటాయి. సాధారణ సంవత్సరం (365 రోజులు), ట్రాపికల్‌ సంవత్సరం ( 365.24రోజులు), లీప్‌ సంవత్సరం ( 366 రోజులు). అంకె 4 తో భాగింపబడే ఏ సంవత్సరమైనా లీప్‌ సంవత్సరం అవుతుంది. కానీ, 100తో కూడా భాగింపబడితే అది లీప్‌ సంవత్సరం కాదు. కానీ 400తో భాగింపబడితే అది లీప్‌ సంవత్సరం అవుతుంది. ఉదాహరణకు 2000, 2400 వ సంవత్సరాలు లీప్‌ సంవత్సరాలు. అయితే, 1800, 1900, 2200, 2300, 2500వ సంవత్సరాలు లీప్‌ సంవత్సరాలు కావు.

లీప్‌ సంవత్సరాన్ని మొట్టమొదట కనుగొన్నది రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌. దాదాపు 2000 సంవత్సరాల క్రితం క్రీ.పూ 45వ సంవత్సరంలో సీజర్‌ సంవత్సరాన్ని అమలు చేసాడు. అందుకే ఆ క్యాలెండర్‌ను జూలియన్‌ క్యాలెండర్‌ అంటారు. దీన్లో ఒకటే నిబంధన. ప్రతి నాలుగేళ్లకోసారి ఒకరోజు కలపడం. అయితే 1500 సంవత్సరాల తర్వాత దీనివల్ల కూడా కాలాలు ముందుకు జరగడం తెలిసింది. ఆ తప్పును సవరించడానికి అప్పుడు కనుగొన్నదే ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగొరియన్ క్యాలెండర్‌.

Read more RELATED
Recommended to you

Latest news