దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలు షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా షూటింగ్‌లను ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఫిలిం చాంబర్‌లో 24 విభాగాలతో అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ ఆగిపోనున్నాయి.
ఫిలిం చాంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీలు దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, నట్టి కుమార్, ఠాగూర్ మధు, రామా సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, శ్యాం ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ, ఆంధ్రాలలో సినిమా షూటింగ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా వ్యాధి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ దీనికి సహకరిస్తున్నారని తెలిపారు.
ఇక కొందరు నిర్మాతలకు ప్రస్తుతం ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని నారాయణ దాస్ నారంగ్ తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నుంచి తెలుగు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి.