మ‌ద్యం ప్రియుల‌కు బీర్ల తిప్ప‌లు.. వైన్ షాపుల ఎదుట నో స్టాక్ బోర్డులు..!

-

తెలంగాణ‌లో సంగారెడ్డి స‌మీపంలో 5 బ్రూవ‌రీలు ఉన్నాయి. ఇవి నిత్యం రెండున్న‌ర ల‌క్ష‌ల కేసుల బీర్లను ఉత్ప‌త్తి చేస్తాయి. అయితే ఇప్పుడు నీటి కొర‌త కార‌ణంగా రోజుకు 1.5 ల‌క్షల కేసుల బీర్ల‌ను మాత్ర‌మే ఉత్ప‌త్తి చేస్తున్నాయి.

ఎండాకాలం మ‌న ద‌గ్గ‌ర బీర్ల‌కు ఎంత డిమాండ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. మ‌ద్యం ప్రియులు బ్రాందీ, విస్కీ, వోడ్కా, ర‌మ్‌ల‌కు బ‌దులుగా వేస‌విలో బీర్ల‌ను తాగేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. మండుతున్న ఎండ‌కు చ‌ల్ల చ‌ల్ల‌గా ఒక‌టి రెండు బీర్ల‌ను సేవిస్తే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంద‌న్న ఉద్దేశంతో చాలా మంది వేస‌విలో బీర్ల‌ను తాగుతుంటారు. అయితే ప్ర‌తి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేస‌విలో డిమాండ్‌కు త‌గిన‌ట్టుగా బీర్ల‌ను స‌ప్లై చేస్తున్న‌ప్పటికీ ఈ వేస‌విలో మాత్రం బీర్ల ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. దీంతో బీర్లు దొర‌క్క మందుబాబులు ప‌డుతున్న తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల బీర్ల‌కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. ఎక్క‌డ చూసినా వైన్ షాపుల ఎదుట బీర్లు నో స్టాక్ అంటూ.. బోర్డులు క‌నిపిస్తున్నాయి. దీంతో బీరు తాగుదామని వైన్ షాపుల‌కు వెళ్లేవారు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. తెలంగాణ‌లోని అనేక జిల్లాల్లో ఈ వేస‌విలో బీర్ల‌కు డిమాండ్ బాగా పెరిగినా స‌ప్లై త‌గినంత లేక‌పోవ‌డంతో మ‌ద్యం వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. కాగా కొన్ని చోట్ల బీర్లు త‌గినంత ల‌భిస్తున్న‌ప్ప‌టికీ చాలా చోట్ల మాత్రం బీర్లు త‌గినన్ని ల‌భించ‌డం లేదు. ఇక బీర్ల కొర‌త కార‌ణంగా కొన్ని వైన్ షాపుల్లో ఒక‌రికి ఒకటే బీరు అనే స్కీంను అమ‌లు చేస్తున్నారు. దీంతో ఆ ఒక్క బీరు అయినా తీసుకుందామని చెప్పి వైన్ షాపుల ఎదుట మ‌ద్యం ప్రియులు బారులు తీరుతున్నారు. క్యూ లైన్ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండి మ‌రీ ఆ ఒక్క బీరును పొందుతున్నారు. అయితే తెలంగాణ‌లో బీర్ల ఉత్ప‌త్తి ఇంత గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి కార‌ణం.. నీటికొర‌తే అని తేలింది.

తెలంగాణ‌లో సంగారెడ్డి స‌మీపంలో 5 బ్రూవ‌రీలు ఉన్నాయి. ఇవి నిత్యం రెండున్న‌ర ల‌క్ష‌ల కేసుల బీర్లను ఉత్ప‌త్తి చేస్తాయి. అయితే ఇప్పుడు నీటి కొర‌త కార‌ణంగా రోజుకు 1.5 ల‌క్షల కేసుల బీర్ల‌ను మాత్ర‌మే ఉత్ప‌త్తి చేస్తున్నాయి. కాగా ఈ 5 బ్రూవ‌రీల‌కు సింగూరు జ‌లాశ‌యం నుంచి ప్ర‌భుత్వం నీటిని ఇస్తుంది. కానీ ప్ర‌స్తుతం ఉన్న నీటి కొర‌త కార‌ణంగా ప్ర‌భుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఈ బ్రూవ‌రీల‌కు నీటిని అందించ‌డం నిలిపివేసింది. దీంతో బ్రూవ‌రీలు ప్రైవేటు ట్యాంక‌ర్లు, బోర్ల ద్వారా నీటిని తెప్పించుకుని బీర్ల‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఒక్కో మ‌ద్యం షాపుకు 100 పెట్టెల బీర్లు స‌ర‌ఫ‌రా అయ్యేవి. కానీ ఇప్పుడు 25 పెట్టెల బీర్లు మాత్ర‌మే అందుతున్నాయి. దీంతో స‌హ‌జంగానే బీర్ల‌కు కొర‌త ఏర్ప‌డింది.

కాగా ఈ వేస‌విలో 70 ల‌క్ష‌ల కేసుల బీర్ల వ‌ర‌కు డిమాండ్ ఉంద‌ని మ‌ద్యం వ్యాపారులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ బీర్ల స‌ప్లై త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో తాము ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని వాపోతున్నారు. మ‌రోవైపు మ‌ద్యం షాపుల వ‌ద్ద‌కు బీర్ల కోసం వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌కు ఏం చెప్పాలో తెలియ‌క వైన్ షాపుల సిబ్బంది త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. బీర్ల కొర‌త అనే స‌మ‌స్య ఇప్పుడు వారికి ఒక త‌ల‌నొప్పిగా మారింది. ఇక వేస‌వి ముగిసి వ‌ర్షాకాలం వ‌స్తే గానీ మ‌ద్యం ప్రియుల బీర్ల స‌మ‌స్య తీర‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news