జాఫర్ రంజాన్ ఉపవాస దీక్షలు చేయలేకపోయినా అతనికి బదులుగా సంజయ్ ఉపవాస దీక్షలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను నిత్యం ముస్లింలలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టగా ఉపవాసం ఉండి.. అనంతరం సాయంత్రం సమయంలో దీక్షను విడుస్తున్నాడు.
మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టుగా మరే ఇతర దేశంలోనూ మనకు కనిపించదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కలసి మెలసి ఉంటారు. ఒకరి పండుగకు మరొకరిని ఇండ్లకు ఆహ్వానించుకుంటారు. విందులు, వినోదాలలో కలసి పాల్గొంటారు. అన్ని పండుగలను కలసి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే భారతీయులు మత సామరస్యాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి కూడా సరిగ్గా ఇదే చేశాడు. ఆయన హిందూ అయి ఉండి తన వద్ద పనిచేస్తున్న ముస్లిం డ్రైవర్ కోసం రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నాడు. ఆందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మహారాష్ట్రలోని మలీ బుల్దానా అటవీశాఖ అధికారిగా ఎన్.సంజయ్ పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర జాఫర్ అనే వ్యక్తి డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఈ సారి రంజాన్ ఉపవాస దీక్షలను జాఫర్ చేయడం లేదని సంజయ్ తెలుసుకున్నాడు. కారణమేమిటని సంజయ్ జాఫర్‌ను అడగ్గా.. అందుకు అతను స్పందిస్తూ.. ఈ సారి ఆర్థిక స్థితి బాగా లేదని, తనకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడ్డాయని, అందుకని రంజాన్ ఉపవాస దీక్షలు చేయలేనని జాఫర్ చెప్పాడు. దీంతో సంజయ్ కదిలిపోయాడు.
అయితే జాఫర్ రంజాన్ ఉపవాస దీక్షలు చేయలేకపోయినా అతనికి బదులుగా సంజయ్ ఉపవాస దీక్షలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను నిత్యం ముస్లింలలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టగా ఉపవాసం ఉండి.. అనంతరం సాయంత్రం సమయంలో దీక్షను విడుస్తున్నాడు. ముస్లింలలాగే ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. దీంతో సంజయ్ పాటిస్తున్న మత సామరస్యానికి అందరూ అతన్ని అభినందిస్తున్నారు. అవును, దేశంలో అందరూ ఇవే భావాలను కలిగి ఉంటే.. అప్పుడు మత కల్లోలాలు ఏర్పడవు కదా..!