కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను దారుణంగా ప్రభావితం చేసింది. ఆ వైరస్ రాకముందు గొప్పగా జీవించినవారు ఇప్పుడు ఒక పూట తిండికి కూడా నోచుకోవడం లేదు. అంతటి దయనీయ స్థితిలో కొందరు కాలం గడుపుతున్నారు. ఇక అనేక మంది తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన 55 ఏళ్ల గుర్మీత్ సింగ్ ఒకరు. ఈయన 1982 నుంచి ఢిల్లీలో తన సోదరులతో కలిసి క్యాబ్ సర్వీస్‌ను నడిపిస్తున్నారు. అయితే కరోనా కారణంగా 3 నెలల నుంచి క్యాబ్‌లు తిరగడం లేదు. అయినప్పటికీ ఈయన తన వద్ద పనిచేస్తున్న ముగ్గురు డ్రైవర్లకు మాత్రం జీతాలు ఇస్తూనే ఉన్నాడు.
గుర్మీత్ సింగ్‌కు 2005లో 25 కార్లు ఉండేవి. 20 మంది డ్రైవర్లు ఆయన దగ్గర పనిచేసేవారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సయోమి నగర్‌లో ఓ ఆఫీస్‌ను కూడా ఆయన ఓపెన్ చేశాడు. అయితే ఓలా, ఊబర్ వంటి కంపెనీల రాకతో ఈయన ట్యాక్సీ బిజినెస్ బాగా తగ్గింది. దీంతో కార్ల సంఖ్య 7కు తగ్గింది. ముగ్గురు డ్రైవర్లు మాత్రమే పనిచేసేవారు. అలా కష్టపడుతూనే ట్యాక్సీ బిజినెస్‌ను కొనసాగించాడు. కానీ కరోనా వల్ల ఆయన బిజినెస్ పూర్తిగా పడిపోయింది. 3 నెలల నుంచి ట్యాక్సీలు నడవడం లేదు. మరోవైపు ఆ ముగ్గురు డ్రైవర్లు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అయినప్పటికీ సింగ్ మాత్రం ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను వారికి జీతాలు ఇచ్చాడు. 3 నెలల నుంచి డ్రైవర్లు పనిచేయకపోయినా వారికి జీతాలను మాత్రం అందజేశాడు.
అయితే ఇప్పుడు ఆంక్షలను సడలించడంతో మళ్లీ క్యాబ్ సర్వీసులు మొదలయ్యాయి. దీంతో బిజినెస్ మళ్లీ ప్రారంభమైంది. అయితే కరోనా దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని అతను అంటున్నాడు. ఇక కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు తాను అర్హుడనని ఆయన తెలిపారు. కానీ బ్యాంకుల చుట్టూ తిరిగితే అప్లికేషన్ ఫాంలు లేవని వింత వింత కారణాలు చెబుతున్నారని వాపోతున్నాడు. మరి బ్యాంకులు ఎప్పుడు కనికరిస్తాయో చూడాలి. ఏది ఏమైనా.. సింగ్ ఒక్కడే కాదు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఎంతో మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారికి సహాయం చేయాల్సిందిగా కేంద్రం బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది.