వన్యప్రాణి కదా.. అడవుల్లో ఉంటే మంచిదని దానిపై జాలి పడి అధికారులు దాన్ని అడవుల్లో వదిలారు. కానీ ఆ పులి మనిషులను చంపి తినడం మొదలు పెట్టింది. దీంతో ఆ పులిని అధికారులు ఎట్టకేలకు వేటాడి పట్టుకున్నారు. దాన్ని బందీని చేశారు. ఇక జీవితాంతం అది బోనులో ఉండాల్సిందేనని, ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని మళ్లీ అడవుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆ పులికి కన్హా నేషనల్ పార్కులో మత్తుమందు ఇచ్చిన అధికారులు దాన్ని అక్కడి నుంచి భోపాల్‌లోని వన విహార్‌కు తాజాగా తరలించారు. ఇకపై ఆ పులి అక్కడే జీవితాంతం బోనులో గడపనుంది.
సదరు పులిని పలు మార్లు అడవుల్లో విడిచిపెట్టామని, కానీ అది ఎప్పుడూ అడవులను వదిలి మనుషులు ఉండే ప్రాంతాలకు వెళ్తూ వారిపై దాడి చేసి చంపుతుందని అధికారులు తెలిపారు. అందుకనే ఆ పులిని ప్రమాదకరంగా గుర్తించి దాన్ని భోపాల్‌కు తరలించామని తెలిపారు. ఆ పులి 5 సంవత్సరాల వయస్సు కలది కాగా దాని బరువు 180 కిలోలు. అది మగది. మహారాష్ట్రలోని మంగ్‌రుల్ దస్తగిర్ ప్రాంతంలో ఆ పులి ఒక వ్యక్తిని చంపింది. తరువాత మరో 3 రోజులకే అక్కడి అమరావతి జిల్లాలో మరో వ్యక్తిని ఆ పులి చంపేసింది. ఇక భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాత్పురా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఆ పులి మూడో వ్యక్తిని చంపింది. ఈ క్రమంలో మొత్తం ముగ్గురిని ఆ పులి పొట్టన పెట్టుకుంది.
కాగా మనుషులకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఆ పులిని కన్హాలో అధికారులు మత్తుమందు ఇచ్చి పట్టుకుని దాన్ని ఎట్టకేలకు భోపాల్‌కు తరలించారు. అక్కడి వన విహార్‌లో ఇప్పటికే 14 పులులు ఉన్నాయి. కొన్ని సాధు స్వభావం కలిగి ఉండడంతో వాటిని మనుషులు చూసేందుకు వీలుగా ఉండే ప్రదేశాల్లో ఉంచారు. ఇక మరో 4 పులులు క్రూర స్వభావాన్ని కలిగి ఉండడంతో వాటిని మిగిలిన పులులకు దూరంగా బోన్లలో ఉంచారు. ఆ క్రమంలో ఆ 4 పులుల వద్దకే ఈ పులి చేరుకుంది. దీన్ని కూడా బోనులో ఉంచనున్నారు.