సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు.. మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారని, తెలంగాణ అసలు స్వరూపాన్ని వివరిస్తామన్నారు. తెలంగాణ నుంచి జాతీయ నాయకుడు అవుతానని కేసీఆర్ అసలు సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. కెసిఆర్ తన వైఫల్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోతే అసలు చర్చ లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు. ఇలాంటి అంశాల మీద ఎన్నికలలో చర్చ లేకుండా పోయిందని.. ఎన్ని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనేదే పోటీగా మారిందన్నారు. భారత రాష్ట్ర సమితితో ఒరిగేదేమీ లేదన్నారు కోదండరాం. మా జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటవ తేదీ తర్వాత జీతంకోలేదని.. కెసిఆర్ ఒకటవ తేదీ జీతం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
రాజగోపాల్ రెడ్డి తన ప్రయోజనాలకు సంబంధించిన హామీని మాత్రమే బిజెపి నుంచి పొందాడని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను చర్చించే ప్రయత్నం చేయట్లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో మేము పోటీ చేస్తున్నామని వెల్లడించారు. కెసిఆర్ వైఫల్యాలను అన్నింటినీ జనంలో పెడతామన్నారు కోదండరాం. అభ్యర్థిని కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.