తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా పెరగనుంది. SC, ST గురుకులాల్లో మరో 2 వేలకుపైగా పోస్టుల్ని ఆయా సొసైటీలు గుర్తించాయి. వాటిని త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా నింపేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి.
ప్రస్తుతం గురుకులాల్లో భర్తీకి 11వేల 12 పోస్టులకు అనుమతులు లభించగా… తాజా పోస్టులతో 13 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కొత్తగా మంజూరయ్యే SC, ST గురుకులాల పోస్టులు వీటికి కలుపుతారు. అన్నింటికీ కలిపి ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని గురుకుల నియామకబోర్డు భావిస్తోంది.
గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఇప్పటికే బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. అందుబాటులోని 11,012 పోస్టులకు నియామక ప్రకటనలు సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అవి నిలిచిపోయాయి. కోడ్ ముగిసే సమయానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పోస్టులకు అనుమతులు వస్తే వాటిని కలిపి ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది.