ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే తాజాగా లైవ్ రూమ్స్ ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకేసారి నలుగురు యూజర్లు లైవ్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. గతంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నలుగురికి అవకాశం కల్పించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న లైవ్ రూమ్స్ ఫీచర్‌ను వాడుకోవాలంటే యాప్‌లోని యువర్ స్టోరీలో ఉండే ప్లస్ అనే సింబల్‌పై టచ్ చేయాలి. తరువాత వచ్చే ఆప్షన్లలో లైవ్ కెమెరాను ఎంచుకోవాలి. అనంతరం సెషన్ పేరు ఏదైనా టైప్ చేయాలి. తరువాత లైవ్ ఆన్ చేయాలి. అనంతరం కింద ఉండే వీడియో కెమెరా సింబల్‌పై టచ్ చేసి యూజర్ మరో ముగ్గుర్ని లైవ్ వీడియోలో యాడ్ చేయవచ్చు. అయితే యాడ్ చేయబోయే ఇతర యూజర్లు కూడా లైవ్‌లో ఉండి ఉండాలి. అలా ఉన్నవారితో మాత్రమే లైవ్ రూమ్స్‌లో మాట్లాడుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తం నలుగురు యూజర్లు లైవ్ రూమ్స్ లో లైవ్ వీడియో ద్వారా మాట్లాడుకోవచ్చు.
కాగా ఇన్‌స్టాగ్రామ్ అందిస్తున్న ఈ ఫీచర్ ప్రస్తుతం భారత్‌తోపాటు ఇండోనేషియాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ మాట్లాడుతూ భారత్‌లోని యూజర్లకు అనుగుణంగానే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత యూజర్లు తమ సంస్కృతి, సంప్రదాయాలను, ఆలోచనలను ఎదుటివారికి వ్యక్తపరిచేందుకు, తమ భావాలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు.