కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతరుగానేకాకుండా.. తెలంగాణ జాగృతి సంస్థతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాయకురాలు. నిజామాబాద్ ఎంపీగా కూడా తనదైన ముద్రవేసారు. అయితే.. 2019 ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. కాస్త విరామం తీసుకుంటున్నారు. త్వరలోనే కీలక పదవితో రాజకీయాల్లో బిజీ కానున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ ఎమ్మెల్యే మాత్రం కవితను ఎంపీగానే పిలుస్తున్నారు. అదేమిటి.. ఓడిపోయిన కవితను ఎంపీగా ఎలా పిలుస్తారని అనుకుంటున్నారా..? ఔను.. ఆ ఎమ్మెల్యే ఎంపీగానే పిలుస్తున్నారు కవితను. అయితే.. ఇందుకు ఓ కారణం కూడా లేకపోలేదు.. ఒక్కసారి గతంలోకి వెళ్లివద్దాం.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత పోటీ చేసి గెలిచారు. ఆమె నియోజకవర్గంలో ఒక్క జగిత్యాల తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. జగిత్యాలలో మాత్రం సంజయ్ ఓడిపోయారు.
అయినా.. కవిత మాత్రం జగిత్యాలపైనే ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సంజయ్‌ని ఎమ్మెల్యే అంటూ కవిత సంబోధించేవారు. ఎమ్మెల్యే సంజయ్ అంటూ పిలిచేవారు. అంటే.. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా సంజయ్‌ని మాత్రం ఎమ్మెల్యేగా సంబోధిస్తూ ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశారు. ఎట్టకేలకే 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపై సంజయ్ గెలిచారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి సీన్ రివర్స్ అయింది.
నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత ఓడిపోయారు. దీంతో సంజయ్ సంతోషం ఎక్కువకాలం నిలవలేకపోయింది. అయితే.. నాడు తనను కవిత ఎమ్మెల్యే అంటూ ఎలా సంబోధించారో.. ఇప్పుడు సంజయ్ కూడా ఓడిపోయిన కవితను ఎంపీగా సంబోధిస్తుండడం గమనార్హం. ఈ అంశంపై జగిత్యాల జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటున్న కవితను ఎలాగైనా.. జగిత్యాలకు ఆహ్వానించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. ఈ అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేగా.. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే మరి.