NPS: రోజుకు రూ. 100 సేవ్‌ చేస్తే రిటైర్‌ అయిన తర్వాత నెలకు రూ. 57,000 పింఛన్‌

-

సంపాదించే ఓపిక, వయసు ఉన్నప్పుడు ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కానీ వయసుపెరుగుతుంది, రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డాక ఉద్యోగం ఉండదు. అప్పుడు ఇంట్లో వాళ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. కన్నవాళ్లు చూసేందుకు కూడా వాటాలు వేసుకుంటారు. కొన్ని నెలలు ఇక్కడ కొన్ని నెలలు అక్కడ. ఉద్యోగ విరమణ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలేం వద్దంటే ఇప్పటి నుంచే అప్పటి కోసం పొదుపు ప్లాన్‌ చేసుకోవాలి. పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్‌. దీనివల్ల, ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత కూడా పెన్షన్‌ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి, మీ అవసరాలన్నీ తీరతాయి. రిటైర్డ్‌ పర్సన్స్‌కు డబ్బు కొరత రానివ్వని చాలా అనేక పింఛను పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిలో ఒకటి… నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఈ స్కీమ్‌లో చేరే ఏ వ్యక్తయినా, ఇంటి బడ్జెట్‌ మీద భారం పడకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి స్టార్ట్‌ చేయవచ్చు.

పదవీ విరమణ తర్వాత, మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి మొత్తం పొందే ఆప్షన్‌తో పాటు, ప్రతి నెలా పెన్షన్ బెనిఫిట్‌ కూడా అందుతుంది. NPS వెబ్‌సైట్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించవచ్చు. రాబడి, ఇతర ప్రయోజనాల గురించి ఆ సైట్‌ ద్వారా మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు. NPS కాలిక్యులేటర్ కూడా సైట్‌లో ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే, ఎంత చేతికి వస్తుందన్న విషయాలను ఆ కాలిక్యులేటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద, చాలా తక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి, నెలకు రూ. 57,000 పెన్షన్ తీసుకోవచ్చు. మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో, నెలకు రూ. 1500 (రోజుకు రూ. 50) పెట్టుబడి పెట్టడం స్టార్ట్‌ చేస్తే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ. 57,42,416 అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం చొప్పున ఈ లెక్క వస్తుంది. మీరు 75 సంవత్సరాల వయస్సు వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం నుంచి నిష్క్రమించే సమయంలో, పెట్టుబడిదారు 100 శాతం వరకు కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

మీ అకౌంట్‌లో పోగయిన మొత్తం డబ్బుతో 100% యాన్యుటీ ప్లాన్‌ కొంటే, నెలకు రూ. 28,712 పెన్షన్ తీసుకోవచ్చు. 40% యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలవారీ పెన్షన్ రూ. 11,485 అవుతుంది. ఇంకా మీ అకౌంట్‌లో రూ. 34 లక్షలు ఉంటాయి, వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.

రోజుకు ₹100తో ఎంత పెన్షన్‌ వస్తుంది?
మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి ప్రతి నెలా 3000 రూపాయలు ‍(రోజుకు 100 రూపాయలు) పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, NPS కాలిక్యులేటర్ ప్రకారం, 60 తర్వాత రూ. 1,14,84,831 జమ అవుతుంది. ఈ మొత్తంతో 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, మొత్తం నెలవారీ పెన్షన్ రూ. 57,412 వస్తుంది. 40% యాన్యుటీని కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్‌ రూపంలో వస్తుంది. అయితే, పదవీ విరమణ తర్వాత ఏకమొత్తంగా రూ. 68 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news